Carens: 'కరెన్స్'... కొత్త కారు తీసుకువచ్చిన కియా... వివరాలు ఇవిగో!
- కియా నుంచి నాలుగో మోడల్
- జనవరి 14న ప్రారంభమైన బుకింగ్స్
- వివిధ వేరియంట్లలో కియా కరెన్స్
- రిక్రియేషన్ వెహికల్ సెగ్మెంట్లో వస్తున్న కరెన్స్
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా కొత్త మోడల్ కరెన్స్ ను నేడు భారత్ లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు లేని విధంగా రిక్రియేషనల్ వెహికల్ (ఆర్వీ) పేరిట కరెన్స్ కోసం కొత్త సెగ్మెంట్ ను సృష్టించింది. ఎంపీవీ, ఎస్ యూవీ తరహాలోనే ఆర్వీ కూడా ఓ విభాగంగా మారిపోతుందని, కరెన్స్ కు విశేష స్పందన వస్తుందని కియా భావిస్తోంది.
ఇందులో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.99 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.16.99 లక్షలు. కరెన్స్ లో క్యాబిన్ ను విశాలంగా రూపొందించారు. కియా కనెక్ట్ యాప్ తో అనుసంధానం చేసే వీలున్న ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థను పొందుపరిచారు. 10.25 టచ్ స్క్రీన్ డిస్ ప్లే, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ (8 స్పీకర్ కాన్ఫిగరేషన్) దీని ప్రత్యేకత.
ఇంటీరియర్ చూస్తే ప్రీమియం లెదర్ సీటింగ్ ఏర్పాటు చేశారు. సన్ రూఫ్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, కియా ట్రేడ్ మార్క్ టైగర్ నోస్ గ్రిల్ కారు అవుటర్ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది.
వివిధ వేరియంట్లకు అనుగుణంగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ట్రాన్స్ మిషన్ పొందుపరిచారు. ఆల్ వీల్ బ్రేక్స్ ఉండడంతో వేగంగా వెళ్లే సమయంలో బ్రేకులు వేసినా కారు బ్యాలెన్స్ తప్పదు. ప్రతి మోడల్ లోరూ రియర్ పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి.
ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా కియా కరెన్స్ లో ఫీచర్లకు కొదవలేదు. దాదాపు 10 భద్రతాపరమైన ఏర్పాట్లు కరెన్స్ లోని వివిధ వేరియంట్లలో చూడొచ్చు. కాగా, కియా నుంచి వస్తున్న నాలుగో కారు ఇది. ఇప్పటివరకు కియా భారత్ లో సెల్టోస్, సోనెట్, కార్నివాల్ మోడళ్లను విక్రయిస్తోంది.