Lassa Fever: లస్సా ఫీవర్... బ్రిటన్ లో కలకలం రేపుతున్న కొత్త జబ్బు!
- బ్రిటన్ లో ముగ్గురి మృతి
- గతంలోనూ లస్సా ఫీవర్ కేసులు
- ఇది మహమ్మారి స్థాయి వ్యాధి అంటున్న బ్రిటన్ వైద్యశాఖ
కరోనాతో తీవ్రస్థాయిలో సతమతమవుతున్న బ్రిటన్ లో కొత్త జబ్బు కలకలం రేపుతోంది. దీని పేరు లస్సా ఫీవర్. ఇది కూడా వైరస్ కారణంగా వచ్చే జ్వరం. ఇప్పటికే ఈ లస్సా ఫీవర్ బారినపడిన బ్రిటన్ లో ముగ్గురు మరణించారు. బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కొత్త వైరస్ గురించి చెబుతూ, ఇది మహమ్మారి స్థాయిలో వ్యాపించే సత్తా ఉన్న వైరస్ అని వెల్లడించారు.
లస్సా ఫీవర్ బ్రిటన్ కు కొత్త కాదు. 1980లోనే ఈ వైరస్ కారణంగా పలు కేసులు గుర్తించారు. 2009లో రెండు కేసులు వెల్లడయ్యాయి. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ (సీడీసీ) లస్సా ఫీవర్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని వెల్లడించింది. ఇది ఎరెనా వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ అని, ఇది తీవ్ర రక్తహీనత కలిగిస్తుందని వివరించింది.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించింది. ఈ వైరస్ బారినపడిన ఎలుకలు ఆహార పదార్థాలపై మలమూత్ర విసర్జన చేసినప్పుడు, ఆ ఆహారాన్ని తీసుకున్న మనుషులు లస్సా వైరస్ బారినపడతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ఇది వ్యక్తుల నుంచి వ్యక్తులకు కూడా వ్యాపిస్తుందని వివరించింది.
అసలు, ఈ వైరస్ ను 1969లో ఆఫ్రికా దేశం నైజీరియాలో మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఇది వెలుగు చూసిన పట్టణం ఆధారంగానే దీనికి లస్సా వైరస్ అనే పేరు వచ్చింది. ప్రతి ఏడాది 1 లక్ష నుంచి 3 లక్షల మంది వరకు లస్సా ఫీవర్ బారినపడుతుంటారని, 5 వేల మంది వరకు చనిపోతుంటారని సీడీసీ పేర్కొంది.
ఇది ఒక్కసారి మానవదేహంలోకి ప్రవేశించాక 2 నుంచి 21 రోజుల వ్యవధిలో విస్తరిస్తుంది. అయితే చాలామందిలో లస్సా ఫీవర్ లక్షణాలు స్వల్పంగానే ఉంటాయని, కొందరిలో అయితే గుర్తించలేమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తొలుత జ్వరంతో ప్రారంభమై నీరసం వంటి లక్షణాలకు గురవుతారని, ఇన్ఫెక్షన్ ముదిరేకొద్దీ రోగిలో తలనొప్పి, గొంతునొప్పి, కండరాల నొప్పులు, ఛాతీ నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, దగ్గు, కడుపు నొప్పి వంటి లక్షణాలకు గురవుతారని వివరించింది.
ఈ లస్సా ఫీవర్ తీవ్రస్థాయికి చేరితే ముఖం ఉబ్బరించడం, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, కొన్ని అవయవాల నుంచి రక్తస్రావం జరగడం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. లస్సా ఫీవర్ ను గుర్తించడం చాలా కష్టమన్నది డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయం. వ్యాధి సోకిన మొదట్లో అయితే ఇది చూపించే లక్షణాల ఆధారంగా ఏమాత్రం గుర్తించలేమని అంటోంది. ఎబోలా, మలేరియా, షిగెలోసిస్, టైఫాయిడ్, యెల్లో ఫీవర్ ల తరహాలోనే దీని లక్షణాలు కూడా ఉంటాయని, దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం కష్టమని అభిప్రాయపడింది.
లస్సా ఫీవర్ చికిత్సలో ప్రధానంగా రిబావిరిన్ వంటి యాంటీ వైరల్ ఔషధాలతో రోగులకు స్వస్థత చేకూరుతుందని సీడీసీ చెబుతోంది. అయితే, లస్సా ఫీవర్ లక్షణాలు కనిపించిన వెంటనే ఈ ఔషధాన్ని ఇస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపింది. అదే సమయంలో రోగి దేహంలో ఆక్సిజన్, రక్తపోటు, శరీర ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతూకం కూడా ముఖ్యమని సీడీసీ వివరించింది.