CPI Narayana: పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుంది: ఏపీ డీజీపీ బదిలీపై సీపీఐ నారాయణ
- గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగింది
- గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్ కు కూడా ఇలాగే జరిగింది
- ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెంపపెట్టన్న నారాయణ
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆకస్మిక బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లనుండడంతో, డీజీపీగా ఇంటెలిజెన్స్ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. అకస్మాత్తుగా గౌతం సవాంగ్‌ను బదిలీ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు.
దీనిపై సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందిస్తూ.. గౌతం సవాంగ్‌కు తగిన శాస్తి జరిగిందని చురకంటించారు. పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుందని చెప్పారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్ లాంటి వారిని ఏపీ ప్రభుత్వం వాడుకుందని, అనంతరం వారు కూడా ఇటువంటి అనుభవాలే ఎదుర్కొన్నారని చెప్పారు.
తాజాగా మరోసారి డీజీపీ బదిలీ అయిన ఉదంతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెంప పెట్టులాంటిదని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి చేయకుండా అధికారంలో ఉన్న వారు చెప్పినట్లు చేస్తూ అధికారులు కూర్చోకూడదని ఆయన హితవు పలికారు.