Raghu Rama Krishna Raju: గౌతమ్ సవాంగ్‌ను గజమాలతో సత్కరిస్తారనుకున్నా: రఘురామకృష్ణరాజు
- ఒత్తిడితో కొన్ని చెడ్డ పనులు చేసినప్పటికీ, సవాంగ్ మంచి అధికారే
- గంజాయి వ్యాపారంపై పట్టున్న వారి ఫిర్యాదు మేరకే సవాంగ్‌పై వేటు
- సీబీఐ విచారణ కావాలన్న సజ్జల ఇప్పుడు సీబీఐపై పోరాడతామని చెప్పడం విడ్డూరం
ఒత్తిడితో కొన్ని చెడ్డ పనులు చేసినా ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తమ అధికారేనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. నిన్న ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు 2 లక్షల కేజీల గంజాయిని దగ్గరుండి దహనం చేయించిన గౌతమ్ సవాంగ్‌ను గజమాలతో సత్కరిస్తారని అనుకున్నానని, కానీ ఆయనను పక్కనపెట్టారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బహుశా గంజాయి వ్యాపారంపై పట్టున్న వారి ఫిర్యాదు మేరకు ఆయనను తప్పించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
సీఐడీ తనను అదుపులోకి తీసుకున్న విషయం సవాంగ్‌కు తెలియదని అన్నారు. తనను హింసించిన కేసులో లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ పంపిన నోటీసులకు ఆయన ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదన్నారు. దీంతో తాను కేంద్రానికి లేఖ రాయడంతో ఆయనపై ఒత్తిడి పెరిగిందన్నారు. సీఐడీ అధికారి సునీల్ కుమార్‌ను ఆయన వివరణ కోరడం కూడా సవాంగ్ ప్రస్తుత పరిస్థితికి కారణం కావొచ్చని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
తనను రోగ్ అని సీఎం సంబోధించారని, కానీ సామాజిక మాధ్యమాల్లో రోగ్ ఎవరని పోల్ పెడితే 91 శాతం ప్రజలు సీఎం జగనే రోగ్ అని అంటున్నారని రఘురామ రాజు ఎద్దేవా చేశారు. గతంలో సీబీఐ విచారణ కోరిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సీబీఐపై పోరాడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.