Sajjala Ramakrishna Reddy: ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలి: చంద్రబాబుకు హితవు పలికిన సజ్జల
- వివేకా హత్య వ్యవహారంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- సాక్ష్యాలను ఎవరు తారుమారు చేస్తారన్న సజ్జల
- సీబీఐ కంటే మెరుగైన దర్యాప్తు చేస్తాడేమోనంటూ వ్యంగ్యం
వైఎస్ వివేకా హత్య వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. రాజకీయ నేతలు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండాలని హితవు పలికారు.
గుండెపోటు అన్నంత మాత్రాన అది దర్యాప్తును ప్రభావితం చేసినట్టు అవుతుందా? అని సజ్జల ప్రశ్నించారు. కనిపించే సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారులు పరిశీలనలోకి తీసుకుంటారు కదా! అని వ్యాఖ్యానించారు. సాక్ష్యాధారాలను ఎవరు తారుమారు చేస్తారని సజ్జల ప్రశ్నించారు. బహుశా సీబీఐ కంటే చంద్రబాబు మెరుగైన దర్యాప్తు చేస్తారేమో! అంటూ ఎత్తిపొడిచారు.
ఎదుటివారిపై సెటైర్లు వేసే క్రమంలో చంద్రబాబు తానే అపహాస్యం పాలవుతున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని, చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి లేకపోవడం అన్నది తమ పార్టీకి పెద్ద దెబ్బ అనీ, జగన్ పెద్ద అండను కోల్పోయారని సజ్జల అన్నారు.