Telangana: తప్పించుకునే ప్రయత్నంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ పై నుంచి కిందపడిన సైబర్ నేరస్తుడు
- తెలంగాణలో పలు నేరాలకు పాల్పడిన నైజీరియన్ ముఠా
- పోలీసులకు చిక్కిన నేరస్తుడు
- హైదరాబాద్ తీసుకొచ్చేందుకు తెలంగాణ భవన్‌లో బంధించిన పోలీసులు
- టాయిలెట్ పైపుల ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో కిందపడి గాయాలు
ఢిల్లీలో పోలీసులకు చిక్కిన ఓ సైబర్ నేరగాడు తప్పించుకునే ప్రయత్నంలో తెలంగాణ భవన్ నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని అమాయకులను బుట్టలో వేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో రూ. 30 లక్షల ఆర్థిక మోసాలతో సంబంధం ఉన్న ఓ నైజీరియన్ పోలీసులకు పట్టుబడ్డాడు.
దీంతో అతడిని హైదరాబాద్ తరలించేందుకు తెలంగాణ భవన్‌లోని గోదావరి బ్లాక్ నాలుగో అంతస్తులోని ఓ గదిలో ఉంచారు. అయితే, టాయిలెట్ పైపుల ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు పట్టుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో చెట్టుకొమ్మలు తగిలి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విమానంలో నిందితుడిని హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది.