Revanth Reddy: సమ్మక్క సారలమ్మలను అవమానించే అధికారం కేసీఆర్ కు ఎవరిచ్చారు?: రేవంత్ రెడ్డి
- మేడారం జాతర వైపు కేసీఆర్ కనీసం కన్నెత్తి చూడలేదు
- మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదు
- ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. రాజుల మీద పోరాడి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన సమ్మక్క సారలమ్మ జాతరవైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమని అన్నారు. రియలెస్టేట్ వ్యాపారి రామేశ్వరరావు నిర్మించిన కృత్రిమ కట్టడాలు (చినజీయర్ సమతామూర్తి) వద్దకు వెళ్తారని మండిపడ్డారు.
దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని విమర్శించారు. సమ్మక్క సారలమ్మలను అవమానించే అధికారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రూ. 200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారంను అభివృద్ధి చేయాలని... ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కుంభమేళా మాదిరే మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.