Gold: ఏడాది గరిష్ఠానికి బంగారం ధర.. మరో మూడు నెలల్లో మరింత పైపైకి!
- వచ్చే మూడు నెలల్లో రూ. 52 వేలకు చేరుకునే అవకాశం
- వెండి ధర కూడా పైపైకే
- ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలే కారణం
- ఇప్పటికే ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్న నికెల్, అల్యూమినియం ధరలు
పసిడి ధర మళ్లీ ఆకాశంవైపు చూస్తోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే బంగారం ధర రూ. 50 వేల మార్కును దాటేసి ఏడాది గరిష్ఠానికి చేరుకుంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. నిన్నటి ట్రేడింగులో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 50,123కు చేరుకోగా, వెండి కిలో ధర రూ. 63,896కు ఎగబాకింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1,900 డాలర్లకు పెరగ్గా, వెండి ధర 23.95 డాలర్లకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటిలో సద్దుమణిగేలా లేవు. ఒకవేళ ఈ సంక్షోభం సమసినా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, వచ్చే మూడు నాలుగు నెలల్లో స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర రూ. 52 వేల మార్కుకు చేరుకోవచ్చని చెబుతున్నారు.
ఉక్రెయిన్పై కనుక రష్యా యుద్ధానికి దిగితే ఆ దేశంపై ఆంక్షలు తప్పవు. అదే జరిగితే రష్యా నుంచి ఎగుమతి అయ్యే బంగారం, ఇతర విలువైన లోహాల సరఫరాలో అంతరాయం తప్పదన్న ఆందోళనల నేపథ్యంలో ఇటీవల నికెల్, అల్యూమినియం ధరలు ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు కూడా అమాంతం పైకి ఎగబాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.