india: సంక్లిష్ట దశలో చైనాతో సంబంధాలు: జై శంకర్
- 45 ఏళ్ల శాంతిని కాలరాసింది
- సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించింది
- ద్వైపాక్షిక సంబంధాలపై దీని ప్రభావం
చైనాతో భారత్ సంబంధాలు ఎంతో సంక్లిష్ట దశలో ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. సరిహద్దు ఒప్పందాలను బీజింగ్ కాలరాస్తోందన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులే ద్వైపాక్షిక సంబంధాలను నిర్ణయిస్తాయని చెప్పారు.
మ్యూనిక్ సెక్యూరిటీ సదస్సు 2022 ప్యానెల్ చర్చలో భాగంగా జై శంకర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. చైనా, భారత్ మధ్య 45 ఏళ్లుగా శాంతి నెలకొంది. ఆ దేశంతో స్థిరమైన సరిహద్దు ఒప్పందం ఉంది. 1975 నుంచి సరిహద్దు వద్ద సైనికుల మరణాల్లేవు. కానీ, ఈ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. వాస్తవాధీన రేఖ వద్దకు సైనిక దళాలను తీసుకురాకూడదన్న విషయమై చైనాతో ఒప్పందాలున్నాయి. చైనా ఈ ఒప్పందాలను ఉల్లంఘించింది’’ అని జై శంకర్ చైనాతో భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించారు.
కనుక చైనాతో సంబంధాలు క్లిష్ట దశలో ఉన్నట్టు జైశంకర్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలతో భారత్ కు 2020 జూన్ ముందు కూడా చక్కటి సంబంధాలున్నట్లు చెప్పారు. చైనా 2020 జూన్ లో గల్వాన్ లోయ వద్ద భారత సైనికులపై దాడికి దిగడం తెలిసిందే. ఇరువైపులా పదుల సంఖ్యలో సైనికుల ప్రాణ నష్టం జరిగింది. అప్పటి నుంచి చైనా ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా భారత్ తో వ్యవహరిస్తూనే ఉంది.