Tollywood: ముగిసిన టాలీవుడ్ విస్తృతస్థాయి సమావేశం

Tollywood wide range meeting concluded

  • ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సమావేశం
  • హాజరైన 24 విభాగాల ప్రతినిధులు
  • సమావేశానికి విచ్చేసిన రాజమౌళి, కొరటాల
  • మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

చలనచిత్ర రంగ పరిస్థితులు, సినీ కార్మికుల సమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు ఇవాళ హైదరాబాద్ ఫిలింనగర్ లోని కల్చరల్ సెంటర్ లో టాలీవుడ్ కు చెందిన 24 విభాగాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్రసీమను ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారు.

చిత్ర నిర్మాణ వ్యయం పెరగడం, క్యూబ్ డిజిటల్ ప్రసారాల చార్జీలు పెరగడం, థియేటర్లపై విద్యుత్ చార్జీల భారం, ఓటీటీలకు ఆదరణ లభిస్తుండడం వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, నట్టి కుమార్, ప్రసన్నకుమార్, సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో అనేక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపామని, సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. మరో 3 నెలల తర్వాత కూడా ఇదే తరహాలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News