Suryakumar Yadav: అర్ధ సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ‘నమస్తే’ సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో ఇదిగో!
- రోహిత్ అవుటైన తర్వాత సూర్యకుమార్ విశ్వరూపం
- 31 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో 65 పరుగులు
- అర్ధ సెంచరీ అనంతరం బ్యాట్ పైకెత్తి అభివాదం
- ఆపై చేతులు జోడించి నమస్కారం
వెస్టిండీస్‌తో గత రాత్రి కోల్తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన చివరి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్‌కే హైలైట్. టీ20ల్లోని అసలైన మజాను చూపించాడు. 31 బంతుల్లో ఫోర్, 7 సిక్సర్లతో ఏకంగా 65 పరుగులు చేశాడు.
సిక్స్ కొట్టి టీ20ల్లో నాలుగో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న అనంతరం సూర్యకుమార్ చేసుకున్న సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అర్ధ శతకం పూర్తయిన వెంటనే బ్యాట్ పైకెత్తి డగౌట్లో కూర్చున్న సహచరులకు అభివాదం చేశాడు. రాహుల్ ద్రవిడ్ స్టాండింగ్ ఒవేషన్‌తో అభినందించగా, సూర్యకుమార్ అద్భుత ప్రదర్శనకు స్కిప్పర్ రోహిత్ సంతోషించాడు. అనంతరం 31 ఏళ్ల సూర్యకుమార్ తన చేతులు జోడించి ‘నమస్తే’ అని చెప్పడం వీడియోలో రికార్డైంది.
ఇప్పుడది సోషల్ మీడియాకు ఎక్కి విపరీతంగా వైరల్ అవుతోంది. అత్యద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులో కుదురుకుని కాపాడుకోగలిగే స్కోరు సాధించాల్సిన అవసరం ఉందని భావించానని మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఎలా రాణించాలన్న దానిపై జట్టు సమావేశాల్లో చర్చించుకున్నట్టు చెప్పాడు. ఇప్పుడది బాగా పనికొచ్చిందని చెప్పుకొచ్చాడు.