Ayyanna Patrudu: జగన్ ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు
- నల్లజర్లలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం
- సభలో జగన్ ను దూషిస్తూ అయ్యన్న వ్యాఖ్యలు చేశారంటూ కేసు
- గతంలో సుచరితను దూషించారంటూ కేసు నమోదు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో పోలీసు కేసు నమోదైంది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించారనే ఫిర్యాదు ఆధారంగా ఆయనపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ను దుర్భాషలాడారంటూ వైసీపీ నేత రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో జగన్ ను దూషిస్తూ అయ్యన్నపాత్రుడు మాట్లాడారని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపై ఐపీసీ సెక్షన్లు 153 ఏ, 505 (2), 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో కూడా అయ్యన్నపై ఒక పోలీసు కేసు నమోదయింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో ఆయన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర హోంమంత్రి సుచరితను దూషించారంటూ న్యాయవాది వేముల ప్రసాద్ ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అప్పట్లో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.