Venkaiah Naidu: మాతృభాషను కాపాడేందుకు ఈ 5 సూత్రాలు అవసరం: వెంకయ్యనాయుడు
- పరిపాలనా భాషగా మాతృభాషకు మరింత ప్రాధాన్యమివ్వాలి
- న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో ఉండాలి
- సాంకేతిక రంగంలో మాతృభాష వినియోగించాలి
- కుటుంబసభ్యులతో మాతృభాషలోనే మాట్లాడాలన్న ఉపరాష్ట్రపతి
ప్రాథమిక విద్య మాతృభాషలో అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నిన్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన భారత్ భారతి భాషా మహోత్సవ్ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
మన మూలాలు, సంస్కృతిని తెలియజెప్పి ముందుకు నడిపించే సారథే భాష అని ఆయన అన్నారు. భాష మన అస్థిత్వాన్ని చెప్పడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే నిక్షిప్తం చేశారని ఆయన అన్నారు. ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినవారికి మాతృభాష ఎంతో బలాన్ని అందిస్తుందని వ్యాఖ్యానించారు.
మాతృభాషను కాపాడేందుకు ఐదు సూత్రాలు అవసరమని చెప్పారు. పరిపాలనా భాషగా మాతృభాషకు మరింత ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో ఇచ్చేందుకు చొరవ చూపాలని చెప్పారు. సాంకేతిక రంగంలో మాతృభాష వినియోగించాలని అన్నారు. కుటుంబసభ్యులతో అందరూ మాతృభాషలోనే మాట్లాడాలని చెప్పారు. ఒకే భాషకు చెందిన వారు తమ భాషలోనే మాట్లాడుకోవాలన్నారు.