BJP: తమిళనాట స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ
- తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బోణి\
- చెన్నైలోని ఓ వార్డులో విజయం, మరికొన్నింటిలో లీడింగ్
- పలు చోట్ల రెండో స్థానంలో కమలం పార్టీ
- బీజేపీ సత్తా చాటిన చోట మూడో స్థానానికి అన్నాడీఎంకే
ఉత్తరాదిన సత్తా చాటుతున్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాదిన మాత్రం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రాంతీయ అభిమానం మెండుగా కలిగిన తమిళనాడులో మాత్రం బీజేపీకి పట్టే చిక్కడం లేదు.
అయితే తాజాగా ఆ రాష్ట్రంలోనూ బీజేపీ పాదం మోపిందనే చెప్పాలి. మంగళవారం నాడు వెలువడిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కొన్ని స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. చెన్నైలోని ఓ వార్డును కైవసం చేసుకున్న బీజేపీ.. మరో నాలుగైదు వార్డులను గెలుచుకునే దిశగా సాగుతోంది.
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే ఘన విజయం సాధించగా.. విపక్ష అన్నాడీఎంకే మాత్రం చతికిలబడిపోయింది. అంతేకాకుండా బీజేపీ సత్తా చాటిన ప్రాంతాల్లో అన్నాడీఎంకే ఏకంగా మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. చెన్నైలోని చాలా వార్డుల్లో డీఎంకే తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో అన్నాడీఎంకేకు బదులుగా బీజేపీ నిలిచింది. బీజేపీ రెండో స్థానానికి చేరుకోవడంతో అన్నాడీఎంకే మూడో స్థానానికి పడిపోయింది. ఈ తరహా పరిస్థితి ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపుతోంది.