KTR: కర్ణాటకలో ఓ చేతకాని ప్రభుత్వం ఉంది: కేటీఆర్
- కర్ణాటకలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్య
- దీనిపై స్పందించరా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించిన నెటిజన్
- హింస ఏ రూపంలో ఉన్నా ఖండిస్తానన్న కేటీఆర్
- బీజేపీ సర్కారు విఫలమైందని వ్యాఖ్య
టీఆర్ఎస్ అధినాయకత్వం గత కొన్నిరోజులుగా బీజేపీపై విమర్శల్లో తీవ్రత పెంచింది. ఓవైపు సీఎం కేసీఆర్ కేంద్రాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ నిప్పులు కురిపిస్తుండగా, మంత్రి కేటీఆర్ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ఓ చేతకాని ప్రభుత్వం ఉందని భావిస్తున్నానని తెలిపారు. మతపరమైన హింసను అడ్డుకోవడంలో ఆ ప్రభుత్వం విఫలమైందని వెల్లడించారు.
హింస ఏ రూపంలో ఉన్నా ఖండించామని, ఇకపైనా అదే పంథా కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కర్ణాటకలో హింసకు పాల్పడినవారు చట్టం ముందుకు రాకతప్పదని, వారికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
కర్ణాటకలో హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్త హత్య జరగడం తెలిసిందే. దీనిపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పట్ల కేటీఆర్ పైవిధంగా స్పందించారు.