Team India: యువీ, మీ జీవితం అన్ని రంగాల్లోని వారికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది: కోహ్లీ భావోద్వేగభరిత స్పందన
- మీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి
- మీరు చూపే దాతృత్వం గొప్పది
- ఎప్పటికీ సంతోషంగా ఉండాలంటూ కామెంట్
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భావోద్వేగ భరిత వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తనపై ఇంత ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు. ఈ మేరకు కోహ్లీకి యువీ అంకితం చేసిన బూట్ల జతను, ఎమోషనల్ లేఖను, యువీతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో కోహ్లీ అభిమానులతో పంచుకున్నాడు.
‘‘కేన్సర్ పై పోరాడి కోలుకున్న మీ జీవితం ఒక్క క్రికెట్ లోని వాళ్లకే కాకుండా అన్ని రంగాల్లోని వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్నవారి పట్ల మీరు చూపే శ్రద్ధ, మీ దాతృత్వం ఎప్పటికీ గొప్పవే. జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. దేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశాడు.
కాగా, అంతకుముందు విరాట్ కోహ్లీకి యువరాజ్ సింగ్ ఎమోషనల్ నోట్ రాశాడు. ‘‘ఢిల్లీ నుంచి వచ్చిన ఓ అబ్బాయి విరాట్ కోహ్లీకి నేను ఈ స్పెషల్ షూను అంకితం చేస్తున్నాను. కెప్టెన్ గా, ఆటగాడిగా ప్రపంచంలోని కోట్లాది మంది మోములపై చిరునవ్వులు కురిపించిన అతడి కెరీర్ కు గుర్తుగా ఈ చిన్న గిఫ్ట్. ఎప్పుడూ నీలాగే నువ్వు ఉంటావని, ఎప్పటిలాగానే నీ ఆటను కొనసాగించి దేశాన్ని గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశాడు.