Bonda Uma: వైయస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను ఢిల్లీ పెద్దలే కాపాడాలి: బొండా ఉమ
- వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి
- అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు
- దస్తగిరిని హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ఉమ
వైయస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు ముప్పు ఉందని, వారిని కాపాడాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదేనని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. జయలలితపై ఉన్న కేసును వేరే రాష్ట్రం కర్ణాటకలో విచారించిన విధంగా... వివేకా హత్య కేసు విచారణను కూడా వేరే రాష్ట్రంలో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు నిందితులను కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను కూడా నాశనం చేస్తోందని ఆరోపించారు.
బాబాయ్ హత్య కేసును విచారిస్తున్న అధికారులపై ముఖ్యమంత్రి జగన్ పోలీసులతో కేసులు పెట్టించారని మండిపడ్డారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలను పాటించడం లేదని సీబీఐ అధికారులపై కక్ష కట్టారని అన్నారు. సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లను ఏపీ పోలీసుల ద్వారా ప్రభుత్వ పెద్దలు సేకరిస్తున్నారని ఆరోపించారు.
వివేకా హత్య కేసులో వైయస్ అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు ఢిల్లీ వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.