Pakistan: పాకిస్థాన్ లో భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర.. అల్లాడుతున్న సామాన్యులు!

Pakistan Facing Gas Crisis

  • ఏటా శీతాకాలంలో పాక్ కు గ్యాస్ కొరత
  • గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయన్న ఆ దేశ ఇంధన శాఖ మంత్రి
  • ఏటా 9% తగ్గిపోతున్నట్టు వెల్లడి
  • ఎల్ఎన్జీ రవాణాకే రూ.60,293 కోట్ల ఖర్చు
  • గ్యాస్ కొనలేక కట్టెల పొయ్యిలనే నమ్ముకున్న జనం

పాకిస్థాన్ ప్రజలు ఇప్పుడు వంట గ్యాస్ ధరలను చూసి వణికిపోతున్నారు. గ్యాస్ కొనుక్కోలేక... కట్టెల పొయ్యి మీద వంట చేసుకోలేక అల్లాడిపోతున్నారు. అవును మరి, ఇప్పుడు అక్కడ గృహ వినియోగానికి గ్యాస్ సిలిండర్ ధర రూ.2,500 గా ఉంది. అదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయితే  రూ.12 వేలుగా ఉంది.

వాస్తవానికి కొన్నేళ్లుగా పాకిస్థాన్ ను గ్యాస్ కొరత వేధిస్తోంది. అది కూడా శీతాకాలం రాగానే ఆ పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలోనే గృహ, పారిశ్రామిక అవసరాల కోసం పాకిస్థాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ని దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే గ్యాస్ నిల్వలు సరిపడా లేక.. ఉన్న వాటికి ఎక్కువ ధర పెట్టలేక వంటను కట్టెల పొయ్యిమీద చేస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. దాని వల్ల తమ ముఖాలు మసిగొట్టుకుపోతున్నాయని గృహిణులు ఆవేదన చెందుతున్నారు. ఎవరైనా బంధువులు వచ్చినా వారికీ ఏమీ చేసిపెట్టలేని పరిస్థితి ఉందంటున్నారు.

గ్యాస్ కొరతపై ఆ దేశ ఇంధన శాఖ మంత్రి హమాద్ అజార్ స్పందించారు. అసలు ఎందుకు కొరత వస్తోందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో ఏటా 9 శాతం చొప్పున గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయన్నారు. అంటే రెండేళ్లలో 18 శాతం గ్యాస్ నిల్వలు తగ్గాయన్నారు. దీంతో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోకతప్పడం లేదని, దాని రవాణాకే 800 కోట్ల డాలర్లు (సుమారు రూ.60,293 కోట్లు) ఖర్చవుతోందని చెప్పారు. ప్రభుత్వం నష్టాలను భరించి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,536 కోట్లు) ఖర్చుకే ప్రజలకు అందిస్తోందని తెలిపారు. అయితే, పరిధి దాటి తాము కూడా గ్యాస్ ను సరఫరా చేయలేమన్నారు.

ఎల్ఎన్జీ సిలిండర్ ధర గత ఏడాది రూ.4,500 ఉండగా.. ఇప్పుడు రూ.12 వేలకు చేరిందని ఓ వ్యాపారి వాపోయారు. వంట చెరకు ధర కూడా రెట్టింపయ్యిందన్నారు. 40 కిలోల వంట చెరకు గతంలో రూ.450 వరకుండగా.. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో రూ.వెయ్యికి తక్కువకు అమ్మడం లేదని చెప్పారు.

 మరోపక్క, ఇటు వస్త్రపరిశ్రమలూ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. పాకిస్థాన్ ఎగుమతుల్లో సింహభాగం వస్త్రపరిశ్రమ నుంచే ఉంటాయి. ఆ వస్త్ర పరిశ్రమలు మొత్తం సహజ వాయువే ప్రధాన ఇంధన వనరుగా నడుస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కొరత ఉండడంతో రేషన్ పద్ధతుల్లో ప్రభుత్వమే గ్యాస్ ను సర్దుబాటు చేస్తున్నట్టు టెక్స్ టైల్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చెబుతోంది. అవసరమైన దాంట్లో కేవలం 40 శాతం గ్యాసే అందుతోందని అంటోంది. దీంతో జనవరి నెలలో 40 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,014 కోట్లు) మేర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News