JC Prabhakar Reddy: సినీ పరిశ్రమపై కక్షతో సాధించేదేంటి?: జేసీ ప్రభాకర్ రెడ్డి
- తాడిపత్రిలో మీడియా ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి
- భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ వేడుకను ప్రస్తావించిన వైనం
- సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సర్కారు అధిక ప్రాధాన్యమిస్తోందని వ్యాఖ్య
- ఏపీ ప్రభుత్వ వైఖరి వల్ల సినీనటులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టీకరణ
సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో ముందుకు సాగుతోందని, ఇలా సినీ పరిశ్రమపై కక్ష పెంచుకుని ఏం సాధిస్తారని టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం నాడు తాడిపత్రిలో మీడియా ముందుకు వచ్చిన జేసీ సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూనే.. అదే పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న వైఖరిని ప్రశ్నించారు.
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించారు. బుధవారం జరిగిన ఈ వేడుకకు స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారని, సినిమా షూటింగ్ల కోసం తెలంగాణలోని సౌకర్యాలను మరింతగా వినియోగించుకోవాలని కేటీఆర్ కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఓ వైపు సినీ పరిశ్రమకు సరికొత్త అవకాశాలను కల్పించే దిశగా తెలంగాణ సాగుతున్న వైనాన్ని ఆయన కొనియాడారు.
అదే సమయంలో సినీ పరిశ్రమపై కక్షగట్టినట్టుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం ద్వారా సాధించేదేమిటని కూడా జేసీ ప్రశ్నించారు. పవన్ సినిమాను అడ్డుకునే దిశగా ఏపీ ప్రభుత్వం సాగుతోందని.. రెవెన్యూ, పోలీసు అధికారులు సినిమా థియేటర్ల మీద పడిపోతున్నారని జేసీ విమర్శించారు.
ఇలాంటి చర్యల వల్ల ఏపీలో సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వ తీరు కారణంగా సామాన్యులకు ఎలాంటి నష్టం ఉండదని, అదే సమయంలో సినీ నటులకు కూడా ఎలాంటి నష్టం ఉండదని కూడా జేసీ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ తీరు వల్ల నష్టపోయేది ఏపీ మాత్రమేనన్న విషయాన్ని గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు.