Jagga Reddy: జగ్గారెడ్డి కాంగ్రెస్ను వీడరు: భట్టి విక్రమార్క
- రేపు నియోజకవర్గ నేతలతో జగ్గారెడ్డి ప్రత్యేక భేటీ
- సీఎల్పీలో భట్టి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలతో భేటీ
- అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానన్న భట్టి
- జగ్గారెడ్డి ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టేనన్నా భట్టి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే దిశగా సాగిన జగ్గారెడ్డి ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టేనని కూడా భట్టి చెప్పుకొచ్చారు.
పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలతో ఆవేదనకు గురైన జగ్గారెడ్డి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఇదివరకే ప్రకటించారు. అయితే పరిస్థితిని అధిష్ఠానం చక్కదిద్దేందుకు కొంత సమయం వేచి చూస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. అందుకోసం కొంత గడువును కూడా నిర్దేశించుకున్నారు. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే పార్టీకి తాను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం నాడు నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన జగ్గారెడ్డి గురువారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు జరిగిన అవమానాలను జగ్గారెడ్డి ఏకరువు పెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకే ఇన్నేసి అవమానాలు జరిగితే.. ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జగ్గారెడ్డిని అనునయించిన భట్టి.. విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని, ఈలోగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని జగ్గారెడ్డికి సూచించారు.