Ukraine: ఉక్రెయిన్‌లో క్షేమంగానే తెలుగు విద్యార్థులు: ఏపీ మంత్రి సురేశ్‌

AP Minister Suresh says all Telugu students in Ukraine are safe

  • ర‌ష్యా బాంబు దాడుల‌తో ఉక్రెయిన్‌లో క‌ల్లోలం
  • అక్క‌డే చిక్కుబడిపోయిన తెలుగు విద్యార్థులు
  • వారితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి సురేశ్
  • సుర‌క్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి  

ర‌ష్యా భీక‌ర దాడుల‌తో ఉక్రెయిన్ చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఫ‌లితంగా ఆ దేశ ప్ర‌జ‌ల‌తో పాటు ఆ దేశానికి వెళ్లిన ఇత‌ర దేశ‌స్తులు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇలాంటి వారిలో 20వేల మంది భార‌తీయులు కూడా ఉన్నారు. భార‌తీయుల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు కూడా చాలా మందే ఉన్నారు. మెజారిటీ భాగం ఉక్రెయిన్‌లో విద్య‌న‌భ్య‌సించ‌డానికి వెళ్లిన విద్యార్థులే.

ఓ వైపు ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబుల‌తో విరుచుకుప‌డుతుంటే.. చ‌దువుకోవ‌డానికి వెళ్లిన త‌మ పిల్ల‌లు ఏమ‌వుతారోన‌ని ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. వీరికి ఉప‌శ‌మ‌నం క‌లిగేలా ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ఓ మంచి వార్త చెప్పారు.

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని మంత్రి సురేశ్‌ తెలిపారు. యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో ఉ‍న్న తెలుగు విద్యార్థులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సుర‌క్షితంగా రప్పించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్‌ అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని ఆయ‌న‌ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News