India: ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో... భారత్ కు పొంచివున్న అమెరికా ఆంక్షల ముప్పు!

India staring at a possibility of US sanctions

  • భారత్ కు రష్యా అతిపెద్ద రక్షణ సరఫరాదారు
  • ఎస్-400 క్షిపణీ రక్షణ వ్యవస్థల కొనుగోలు
  • దీనిపై ఇప్పటికే అమెరికా అభ్యంతరం
  • రష్యా తాజా చర్యతో భారత్ పై మరిన్ని ఒత్తిళ్లు

భారత్ కు చిరకాల మిత్ర దేశం రష్యా. అత్యాధునిక ఆయుధ సంపత్తిని భారత్ కు అందించడం ద్వారా కీలక వాణిజ్య భాగస్వామిగా ఉంటోంది. దశాబ్దాలుగా ఇరు దేశాల చెలిమి బలంగానే కొనసాగుతోంది. కానీ, ఇది అమెరికాకు గిట్టదు. భారత్ కొంటే అది అమెరికాతోనే చేయాలన్నది అగ్రరాజ్యం వైఖరి. అమెరికాతో ఆయుధ, రక్షణ ఒప్పందాలు భారత్ కు ఉన్నా.. రష్యాతో ఆయుధ వ్యాపారమే ఎక్కువ.

ఇప్పటి వరకు ఈ విషయంలో అమెరికా భారత్ ను హెచ్చరించడం వరకే పరిమితమైంది. అంతేకానీ, ఆర్థిక ఆంక్షల జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది. అమెరికా, ఐరోపా సమాజం రష్యా చర్యను తీవ్రంగా ఖండించాయి. రష్యాపై కఠిన ఆంక్షలను ప్రకటించాయి. దీంతో రష్యా నుంచి భారత్ రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే అమెరికా ఆంక్షలకు దిగొచ్చని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు.

కౌంటరింగ్ అమెరికా అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (క్యాట్సా) అనే చట్టం ఒకటి ఉంది. ఇది రష్యా నుంచి ఇతర దేశాలు ఆయుధాలు కొనకుండా నిరోధిస్తోంది. కానీ, పూర్వపు ట్రంప్ సర్కారు, బైడెన్ సర్కారుతో భారత్ మెరుగైన సంబంధాల వల్ల ఈ చట్టం కింద ఆంక్షలను తప్పించుకుంది.

దీంతో క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను రష్యా నుంచి దిగుమతి చేసుకున్నా, అమెరికా హెచ్చరించినట్టు ఆంక్షల జోలికి పోలేదు. మొదటి ఐదు ఎస్-400 వ్యవస్థలు కొన్ని నెలల క్రితమే భారత్ కు అందాయి. ఇందుకోసం భారత్ రూ.40,000 కోట్లతో రష్యాతో 2018 అక్టోబర్ లో ఒప్పందం చేసుకుంది. చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో మోదీ సర్కారు ఈ ఒప్పందానికి మొగ్గు చూపడం గమనార్హం.

3 బిలియన్ డాలర్లతో అకులా-1 క్లాస్ సబ్ మెరైన్ కొనుగోలుకు భారత్ 3 బిలియన్ డాలర్లతో 2019 మార్చిలో రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది. రష్యా అతిపెద్ద రక్షణ సరఫరాదారుగా ఉంటే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికాతోనూ రక్షణ ఉత్పత్తుల ఒప్పందాలు భారత్ కు ఉన్నాయి.

మరోపక్క, ఎస్-400 కొనుగోలు చేయవద్దంటూ అమెరికా ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదు. భారత్ తో తనకున్న వాణిజ్య అవసరాల కోణంలో అమెరికా కూడా చూసీ చూడనట్టు వ్యవహరించింది. కానీ, ఇకపై అమెరికా, ఐరోపా.. రష్యాతో ఆయుధ వ్యాపారం విషయంలో భారత్ కు అడ్డుతగలొచ్చని, ఒత్తిడి తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News