Imran Khan: పుతిన్ వద్ద కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- రష్యాలో పర్యటించిన ఇమ్రాన్ ఖాన్
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ తో భేటీ
- కశ్మీర్ అంశం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- రష్యాతో దీర్ఘకాలిక సంబంధాలు కోరుకుంటున్నామని వెల్లడి
యావత్ ప్రపంచం ఉక్రెయిన్ పై రష్యా దాడి పట్ల దిగ్భ్రాంతికి గురైన వేళ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించారు. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు ప్రయత్నిస్తున్న సమయంలోనే... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాస్కోలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పుతిన్ వద్ద ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. రష్యాతో దీర్ఘకాలిక బహుముఖ సంబంధాలకు కట్టుబడి ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం అత్యవసరమని నొక్కి చెప్పారు.
రెండ్రోజుల పర్యటనకు రష్యా వచ్చిన ఇమ్రాన్ ఖాన్... పుతిన్ తో దాదాపు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. గత 23 ఏళ్లలో ఓ పాక్ ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇమ్రాన్ ఖాన్ పర్యటనపై పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
"దక్షిణాసియాలోని పరిస్థితులను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా అధినేత దృష్టికి తీసుకెళ్లారు. భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయిలో జరుగుతున్న విషయాన్ని ఎత్తి చూపారు. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం అత్యావశ్యకం అని పుతిన్ కు తెలియజేశారు" అని ఆ ప్రకటనలో వివరించింది.