Ukraine: ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా స్నేహ హస్తం.. ఆఫర్ ను తిరస్కరించిన అధ్యక్షుడు!
- కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్న అమెరికా
- ఇక్కడే ఉండి పోరాడుతామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
- ఉక్రెయిన్ ను కాపాడుకుంటామని ధీమా
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించే దిశగా రష్యా దాడులను తీవ్రతరం చేసింది. రష్యా బలగాలు కీవ్ లో అడుగుపెట్టడంతో దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని ఆ దేశ భద్రతాబలగాలు బంకర్ లోకి తరలించాయి. మరోవైపు ఆయన కీవ్ ను వదిలి వెళ్లారనే వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అమెరికా స్నేహ హస్తం చాచినట్టు సమాచారం. అయితే అమెరికా ఆఫర్ ను జెలెన్ స్కీ సున్నితంగా తిరస్కరించినట్టు ఉక్రెయిన్ మీడియా తెలిపింది.
మరోవైపు తాను ఎక్కడకీ వెళ్లలేదని, కీవ్ లోనే ఉన్నానని జెలెన్ స్కీ ఓ వీడియో ద్వారా తెలిపారు. తన స్టాఫ్ తో కలిసి కొన్ని గంటల కిందట ఆయన ఈ వీడియోను విడుదల చేశారు. అందరం ఇక్కడే ఉన్నామని, ఇక్కడే ఉండి పోరాడుతామని చెప్పారు. ఉక్రెయిన్ ను కాపాడుకుంటామని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనకు కూడా ఆయుధాలు కావాలని అన్నారు.