YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హంతకులెవరో తేలిపోయింది: సీపీఐ నారాయణ
- వివేకా హత్య కేసులో ఇకపై విచారణ అక్కర్లేదు
- వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలి
- సీబీఐపై ఎదురు దాడి జరుగుతోందన్న నారాయణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐ వేగం పెంచిన నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యపై ఇక విచారణే అవసరం లేదని పేర్కొన్న నారాయణ.. వివేకాను చంపిందెవరో ఇప్పటికే తేలిపోయిందని అన్నారు. వివేకాను చంపిందెవరో అందరికీ తెలిసిపోయిందన్న నారాయణ.. ఆ హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుంచితే, వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత కొంత కాలంగా కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో వివేకా హత్యకు సంబంధించి మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపై కూడా ఎదురు దాడి జరుగుతోందని.. ఇదే పరిస్థితి కొనసాగితే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.