Vodka: యుద్ధంపై నిరసన... రష్యా వోడ్కాను నేలపాలు చేస్తున్న వైన్ షాపు యజమానులు
- ఉక్రెయిన్ పై రష్యా దాడి
- ఖండించిన ప్రపంచ దేశాలు
- అనేక దేశాలకు రష్యా నుంచి వోడ్కా ఎగుమతి
- రష్యా మద్యంపై పలు దేశాల్లో వ్యతిరేకత
పొరుగుదేశం ఉక్రెయిన్ పై పంజా విసురుతున్న రష్యా... ఆ దేశ రాజధాని కీవ్ పై పట్టుకు భీకర పోరాటం చేస్తోంది. ఉక్రెయిన్ పౌరులు సైతం ఆయుధాలు ధరించి రష్యాపై యుద్ధానికి సై అంటున్నారు. ఉక్రెయిన్ వంటి చిన్నదేశంపై రష్యా దమనకాండను ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు. అంతేకాదు, అమెరికా, కెనడా దేశాల్లో వినూత్న రీతిలో రష్యాపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
రష్యా తయారీ వోడ్కా మద్యానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. వోడ్కా సెగ్మెంట్లో రష్యన్ బ్రాండ్లకు తిరుగులేదు. అయితే, అమెరికా, కెనడా దేశాల్లోని వైన్ షాపులు, బార్లు, లిక్కర్ స్టోర్లు తమ వద్ద ఉన్న వోడ్కా నిల్వలను నేలపాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ కెనడా, మనిటోబా, న్యూ బ్రున్స్ విక్, బ్రిటీష్ కొలంబియా, న్యూ ఫౌండ్ లాండ్ లో వోడ్కా మద్యాన్ని పారబోస్తున్నారు.
ప్రఖ్యాత నోవా స్కాషియా లిక్కర్ కార్పొరేషన్ తన గోదాముల నుంచి రష్యన్ మద్యాన్ని తొలగిస్తోంది. కనీసం తన వెబ్ సైట్లోనూ రష్యా బ్రాండ్లు కనిపించకుండా చేసింది. అమెరికాలో విషిటా, కాన్సాస్ ప్రాంతాల్లోనూ పలు బార్లు, వైన్ షాపుల వద్ద వోడ్కా బాటిళ్లలో ఉన్న మద్యాన్ని పారబోస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఎలాంటి కారణం లేకుండానే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వైన్ షాపులు, బార్లు, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చెబుతున్నాయి.