Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతోన్న పోలింగ్
- 12 జిల్లాల్లోని 61 స్థానాల్లో ఎన్నికలు
- మొత్తం 692 మంది అభ్యర్థులు
- 300కు పైగా నియోజకవర్గాల్లో గెలుస్తామంటోన్న బీజేపీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లోని 12 జిల్లాల్లోని 61 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రయాగ్ రాజ్, అమేథీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయా స్థానాల్లో మొత్తం 692 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
ఈ రోజు జరుగుతోన్న ఎన్నికల్లో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య సహా పలువురు మంత్రులు పోటీలో నిలిచారు. నేడు దాదాపు 2.24 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యూపీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీ ప్రజలు అభివృద్ధికే ఓటు వేస్తారని చెప్పారు. తాము ఈ ఎన్నికల్లో 300కు పైగా నియోజక వర్గాల్లో గెలుస్తామని జోస్యం చెప్పారు. కాగా, మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే.
నేటితో మొత్తం 292 స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది. తదుపరి విడతల పోలింగ్ మార్చి 3, 7 తేదీల్లో జరగనుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 10న వెలువడనున్నాయి. అత్యధిక నియోజక వర్గాలు ఉండే యూపీ ఎన్నికల్లో గెలిచే పార్టీ కేంద్రంలోనూ చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.