Russia: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘మ్రియా’ను ధ్వంసం చేసిన రష్యా
- హోస్టామెల్ ఎయిర్పోర్టుపై రష్యా దాడి
- విమానం ధ్వంసమైనట్టు పేర్కొన్న ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
- వారు ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ కలను కాదన్న ఉక్రెయిన్
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘ఏఎన్-225 మ్రియా’ను రష్యా దళాలు ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ భాషలో ‘మ్రియా’ అంటే కల. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ దీనిని తయారుచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ విమానం రాజధాని కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్పోర్టుపై రష్యా జరిపిన దాడిలో ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు.
‘మ్రియా’ను ధ్వంసం చేయడంపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. దీనిని తాము పునర్నిస్తామని స్పష్టం చేసింది. బలమైన, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామని అధికార ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. రష్యా ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ మ్రియా ఎప్పటికీ నశించదని పేర్కొంటూ విమానం ఫొటోను షేర్ చేసింది.