Revanth Reddy: చేతకాకే ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

Revanth Reddy comments on Prashant Kishor
  • కేసీఆర్ కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
  • మరో 12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది 
  • ప్రగతి భవన్ ను నాలెడ్జి సెంటర్ గా మారుస్తాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో మళ్లీ గెలవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కు చేతకావడం లేదని... అందుకే బీహార్ నుంచి ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. మరో 12 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ ను నాలెడ్జి సెంటర్ గా మారుస్తామని చెప్పారు. తాము పెట్టే తొలి సంతకం దీనిమీదేనని చెప్పారు. 

అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక రోగం ఉందని... ఒకరు పాటను అందుకున్నప్పుడు ఇతరులు పాడరని రేవంత్ అన్నారు. అందరూ ఒకేసారి పాటను అందుకోకపోవడం కాంగ్రెస్ బలహీనత అని చెప్పారు. అందరం ఒకేసారి పాడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రగతి భవన్ బానిస అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాబూమోహన్ కి ఎక్కువ, బ్రహ్మానందంకు తక్కువని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీశ్ రావు అగ్గిపెట్టె మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను అధికారం నుంచి తరిమి కొడితేనే రాష్ట్ర సమస్యలు తీరుతాయని అన్నారు.
Revanth Reddy
Congress
KCR
TRS
Prashant Kishor

More Telugu News