Chandrababu: వివేకా హత్యను నాపై తోసేయాలని ప్రయత్నించారు: చంద్రబాబు
- హత్య కేసులో ప్రతి వాంగ్మూలంలో జగన్ నిందితుడిగా తేలుతున్నారు
- బాబాయ్ హత్యతో జగన్ అన్ని విధాలా పతనమయ్యారు
- హత్యకు ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం అందరికీ అర్థమయింది
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ వాంగ్మూలాన్ని చూసినా సీఎం జగనే నిందితుడిగా తేలుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసును తనపై నెట్టాలని ప్రయత్నించారని చెప్పారు.
బాబాయ్ హత్య ఘటనతో జగన్ అన్ని విధాలుగా పతనమయ్యారని అన్నారు. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది? ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అని జగన్ అనడం దారుణమని... చట్టం అంటే లెక్కలేనితనాన్ని ఇది సూచిస్తోందని మండిపడ్డారు. వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం అందరికీ అర్థమయిందని చెప్పారు.
ఆనాడు గ్యాగ్ ఆర్డర్ ను తీసుకురావడం నుంచి ఇప్పుడు సీబీఐని తప్పుపట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రతి సమస్యను తప్పుదోవ పట్టించేందుకు జగన్ మళ్లింపు రాజకీయాలు అమలు చేస్తున్నారని... ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోనంత అమాయకులు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. వైయస్ రాజశేఖరరెడ్డి కోటలోనే ఆయన సోదరుడిని హత్య చేశారని... పెద్దల ప్రోత్సాహం లేకుండా హత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు.