Telangana: గవర్నర్ ప్రసంగం లేదు.. తొలి రోజే తెలంగాణ బడ్జెట్
- గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాల ప్రారంభం
- అందుకు విరుద్ధంగా ఈ దఫా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- తొలి రోజుననే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏ ప్రభుత్వమైనా గవర్నర్ ప్రసంగంతో మొదలుపెడుతుంది. అనాదిగా ఈ సంప్రదాయం వస్తోంది. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టేసిన టీఆర్ఎస్ సర్కారు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మొదలుపెట్టేందుకు నిర్ణయించింది.
ఈ మేరకు సోమవారం ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయిన సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల తొలి రోజుననే వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు మార్చి 7న తెలంగాణ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.