Tammineni Sitaram: పవన్ కల్యాణ్ మరో నాలుగు రోజులు ఆగితే బాగుండేది: తమ్మినేని సీతారాం
- పవన్ పై ఎంతో ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు, లోకేశ్ మాట్లాడుతున్నారు
- జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి వీరిద్దరు ఏరోజు మాట్లాడలేదు
- పవన్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం మాకు సాధ్యం కాదన్న తమ్మినేని
సినిమాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ యత్నిస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నడూ లేని విధంగా సినీ పరిశ్రమకు సంబంధించి వీరు ట్వీట్లు చేస్తున్నారని చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారని... కానీ, ఆయన సినిమా గురించి చంద్రబాబు, లోకేశ్ ఏనాడూ ఆలోచించలేదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారే స్వభావం వీరిదని మండిపడ్డారు.
చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో గతంలో చంద్రబాబు ఇబ్బందులు పెట్టారని తమ్మినేని చెప్పారు. సినిమా బాగుంటే ఆడుతుందని, బాగాలేకపోతే ఫ్లాప్ అవుతుందని అన్నారు. 'అఖండ', 'డీజే టిల్లు' సినిమాలు బాగా ఆడాయని అన్నారు. తమ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అయినా, ఆయన కుమారుడు అకీరానందన్ అయినా ఒకటేనని చెప్పారు. టికెట్లకు సంబంధించి జీవో రాకముందే సినిమాను విడుదల చేసి.. ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్నారని మండిపడ్డారు. సినిమా విడుదలను మరో నాలుగు రోజులు వాయిదా వేసుకుని ఉంటే... అదనపు షోలు, టికెట్ రేట్లు వచ్చేవని చెప్పారు. పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడం తమ ప్రభుత్వానికి సాధ్యం కాదని అన్నారు.