Air Force: వెంటనే కీవ్ నగరాన్ని విడిచిపెట్టేయండి.. భారతీయులకు సూచన.. తరలింపుకు ఎయిర్ ఫోర్స్ విమానాలు!
- ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం పిలుపు
- రైళ్లు, ఇతర మార్గాల్లో వెళ్లిపోవాలని సూచన
- సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎయిర్ ఫోర్స్ ను కోరిన ప్రధాని
- రంగంలోకి సీ-17 విమానాలు
ఉక్రెయిన్ లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉక్రెయిన్ పౌరులను సైతం రష్యా దళాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందనన్న భయానక వాతావరణం నెలకొని ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి భారతీయులు అందరూ వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచన జారీ చేసింది. భారతీయ విద్యార్థులు, భారత జాతీయులు అందరూ రైళ్లు లేదా ఇతర మార్గాలలో ఈ రోజే కీవ్ ను వీడాలని కోరింది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎయిర్ ఫోర్స్ సాయాన్ని కోరారు. ఉక్రెయిన్ లో సుమారు 10,000 మంది వరకు భారతీయులు ఉంటారని అంచనా. ఇప్పటికి 4,000 మంది వెనక్కి వచ్చేసి ఉంటారని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా ఒక్కటే విమానాల ద్వారా భారతీయులను తీసుకువస్తోంది. దీంతో తరలింపును మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ సాయాన్ని ప్రధాని కోరడం గమనార్హం.
యుద్ధ విమానాల సామర్థ్యం అధికంగా ఉంటుంది. దాంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని చేరవేయడం సాధ్యపడుతుంది. అంతేకాకుండా మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించినట్టు అవుతుందని కేంద్రం భావిస్తోంది. ఆపరేషన్ గంగా కార్యక్రమం కింద భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానాలను రంగంలోకి దించనుంది.
సీ-17 యుద్ధ విమానం ఒకటి కనీసం 1,000 మందిని చేరవేయగలదు. అదే ఎయిర్ ఇండియా విమానం అయితే 200-240 మధ్యే ఒక ట్రిప్ లో తీసుకు రాగలదు. సీ-17 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.