Russia: ఉక్రెయిన్ కోసం రష్యాతో తలపడేది లేదు.. కానీ..: జో బైడెన్ కీలక ప్రకటన
- ఉక్రెయిన్‌కు మా మద్దతు ఉంటుంది
- నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం
- ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో రష్యాను హెచ్చరించిన బైడెన్
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూనే.. రష్యాతో ఆ దేశం చేస్తున్న యుద్ధంలో పాలుపంచుకోబోమని తేల్చి చెప్పారు. అయితే, మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. నాటో భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ పరిరక్షించుకుంటామని ప్రతిన బూనారు.
ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో పుతిన్ ప్రస్తుతానికి విజయం సాధించవచ్చేమో కానీ దీర్ఘకాలంలో అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో బైడెన్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఉంటుందని పేర్కొన్న బైడెన్.. రష్యాతో జరిగే పోరాటంలో అమెరికా మాత్రం పాల్గొనబోదని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ గడ్డపై అమెరికా బలగాలు రష్యాతో పోరాడబోవని బైడన్ పేర్కొన్నారు.
‘‘మా దళాలు ఉక్రెయిన్ కోసం పోరాడడం లేదు. కానీ మా నాటో మిత్రదేశాలను రక్షించడానికి, పుతిన్ పశ్చిమ దేశాలవైపు కన్నెత్తి చూడకుండా నిరోధిస్తాయి. పోలండ్, రొమేనియా, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియాతో సహా నాటో దేశాలను రక్షించడానికి భూ బలగాలు, వాయుసేన, నౌకలను సిద్ధం చేశాం’’ అని చెబుతూ రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.