Ukraine: బయటపడే మార్గమే కనిపించడం లేదు.. రష్యా బోర్డర్ నుంచి తరలించండి: 500 మంది విద్యార్థుల రోదన
- తూర్పు ఉక్రెయిన్ లోని సూమీ సిటీలో చిక్కుకున్న విద్యార్థులు
- పశ్చిమ ఉక్రెయిన్ నుంచి మాత్రమే మన వాళ్లను ఇండియాకు తరలిస్తున్న పరిస్థితి
- తూర్పు ఉక్రెయిన్ లో పరిస్థితి దారుణం
- అక్కడి నుంచి కదలలేని స్థితిలో భారతీయులు
- బంకర్లలోనే తలదాచుకుంటున్న వైనం
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ఊపందుకుంది. అయితే ఈ తరలింపు ప్రక్రియ మొత్తం పశ్చిమ ఉక్రెయిన్ కు ఆనుకుని ఉన్న సరిహద్దు దేశాల నుంచి మాత్రమే జరుగుతోంది. రష్యా వైపు ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యన్ బలగాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చే పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఖార్ఖివ్ లోనే కర్ణాటకకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ ని రష్యా సైనికులు కాల్చి చంపేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి ఎవరూ బయటపడే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో రష్యా బోర్డర్ కు అత్యంత సమీపంలో ఉన్న సూమీ నగరంలో ఉన్న మన వాళ్లు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడి నుంచి బయటపడే అవకాశమే లేదనే విధంగా వారు భయపడుతున్నారు. ఈ నగరంలో 500 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరంతా రష్యాలోని ఇండియన్ ఎంబసీకి ఒక విన్నపం చేశారు.
సూమీ నుంచి 20 గంటల పాటు ప్రయాణం చేసి వెస్టర్న్ బోర్డర్ కు చేరుకునే పరిస్థితి తమకు లేదని చెప్పారు. రైలు మార్గాలను పేల్చి వేశారని, రోడ్డు మార్గంలో మందుపాతరలను పేర్చారని, ఈ పరిస్థితుల్లో తాను కనీసం రాజధాని కీవ్ వరకు వెళ్లడం కూడా అసంభవమని తెలిపారు. ఈ నేపథ్యంతో, తమకు దగ్గరలో ఉన్న రష్యా బోర్డర్ నుంచే తమను వెనక్కి రప్పించే ప్రయత్నం చేయాలని వారు వేడుకుంటున్నారు.
రష్యన్ బోర్డర్ నుంచి తమను వెనక్కి రప్పించాలని మాస్కోలోని ఇండియన్ ఎంబసీని కోరుతున్నామని వైద్య విద్యార్థిని అంజు టోజో అన్నారు. ఇక్కడి నుంచి బయటపడటానికి తమకు మరో మార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమీ నుంచి కీవ్ కు మధ్యలో ల్యాండ్ మైన్స్ ఉన్నాయని మరో విద్యార్థి తెలిపారు. బంకర్లలో గడుపుతున్నామని, విపరీతమైన చలి ఉందని ఇంకో విద్యార్థి చెప్పారు. సుమీ నగరంలో షెల్లింగ్, దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఆహారం, నీటి కొరత ఉందని తెలిపారు. సామాన్యుల చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయని చెప్పారు.