BCCI: బీసీసీఐ కాంట్రాక్టుల్లో మరింత దిగజారిన రహానే, పాండ్యా గ్రేడ్‌లు
- ఈసారి గ్రూప్-ఎలో ఐదుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు
- రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుకునే ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, రోహిత్, బుమ్రా
- గ్రేడ్-ఎ నుంచి గ్రేడ్-సికి పడిపోయిన శిఖర్ ధావన్
- మహిళా క్రికెటర్ల గ్రేడ్‌లను కూడా ప్రకటించిన బీసీసీఐ
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ షాకిచ్చింది. కాంట్రాక్టుల్లో వారి స్థానాలు దిగజారాయి. శ్రీలంకతో ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మ వార్షిక కాంట్రాక్టుల గ్రేడ్‌లను ‘ఎ’ నుంచి ‘బి’కి తగ్గించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్ గ్రేడ్‌లు ఏకంగా ‘సి’కి పడిపోయాయి.
గ్రేడ్-ఎలో గతేడాది పదిమంది ఆటగాళ్లకు చోటు దక్కగా ఈసారి కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లకు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ గ్రేడ్-సి నుంచి గ్రేడ్-బికి ఎగబాకాడు. 7 కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుకునే ‘ఎ ప్లస్’ ఆటగాళ్ల విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌లు గ్రూప్-ఎలో కొనసాగుతుండగా ఇప్పుడు దీప్తిశర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లకు కూడా ఇందులో చోటు దక్కింది. వీరికి ఏడాదికి రూ. 50 లక్షల వేతనం లభిస్తుంది. సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి రూ. 30 లక్షల వార్షిక వేతనం జాబితాలో ఉన్నారు. జెమీమా రోడ్రిగ్స్ గ్రేడ్-బి నుంచి రూ. 10 లక్షల వార్షిక వేతనం లభించే గ్రేడ్-సికి పడిపోయింది.