Russia: యుద్ధం అంటే వణికిపోతున్న రష్యా సైనికులు.. బలగాల యూనిట్ల మధ్య కొరవడిన సమన్వయం!
- రష్యా బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం
- రష్యా సైన్యంలో ఎక్కువ మంది యువతే
- యువ సైనికులకు సరైన శిక్షణ లేని వైనం
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా బలగాలు ఓ రేంజ్ లో ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగాయి. ఆ దూకుడు చూసి మూడు రోజుల్లో ఉక్రెయిన్ ను రష్యా హస్తగతం చేసుకుంటుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించడం ప్రారంభమయింది. దీంతో రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ విమానాలను, ట్యాంకులను కోల్పోయింది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై పట్టు సాధించేందుకు కనిపించిన ప్రతిదాన్నీ కాల్చేయండి అనే ఆదేశాలు రష్యా సైనికులకు అందాయి. దీంతో, యుద్ధం చేయాలంటేనే భయపడే స్థితికి రష్యా సైనికులు వచ్చారు. రష్యా సైన్యంలో ఎక్కువ మంది యువత ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన సైనిక శిక్షణ కూడా లేదు.
దీంతో, భీకర యుద్ధంలో ముందుకు సాగడానికి వీరు బెంబేలెత్తిపోతున్నారు. వీరిని వేధిస్తున్న మరొక సమస్య ఏమిటంటే... ఆహారం, ఇంధన కొరత. ఈ క్రమంలో యుద్ధం చేయకుండా తప్పించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగానే వారు యుద్ధంలో ఉపయోగించే వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. తాము ప్రయాణిస్తున్న వాహనాలకు పంక్చర్లు చేస్తున్నారు.
మరోవైపు షాడో బ్రేక్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... రష్యా బలగాల యూనిట్ల మధ్య సమన్వయం ఏమాత్రం లేదని తెలిపింది. కొన్ని సందర్భాల్లో వారిలో వారే ఘర్షణకు దిగుతున్నారని చెప్పింది. యుద్ధ క్షేత్రంలో ఉన్న రష్యన్ సైనికుడికి, కమాండ్ సెంటర్ లో నుంచి ఆదేశాలు ఇచ్చే అధికారికి మధ్య పెద్ద వాగ్వాదం జరిగిందని తెలిపింది. తాను ఉన్న ప్రాంతంలో సాధారణ ప్రజలు ఉన్నారని... వారు ఇక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకు తాను ఆయుధాలను ఉపయోగించనని సదరు కమాండ్ కు సైనికుడు గట్టిగా చెప్పాడని వెల్లడించింది. ఇదే విధంగా పలు చోట్ల కమాండ్ ఆర్డర్లను సైనికులు తిరస్కరిస్తున్నట్టు సమాచారం.