education loan: విద్యా రుణం తీసుకోవడానికి ముందు.. వీటిని తెలుసుకోవాల్సిందే!

5 things to consider before getting an education loan

  • ప్రముఖ విద్యాసంస్థల్లో చేరే వారికే రుణాలు
  • ట్యూషన్ ఫీజుకే రుణం పరిమితం
  • ఉద్యోగంలో చేరిన తర్వాత చెల్లింపులు
  • తల్లిదండ్రులు అయినా చెల్లించొచ్చు
  • స్కాలర్ షిప్ మార్గాలు కూడా ఉన్నాయి

నాణ్యమైన ఉన్నత విద్య కోసం తమ పిల్లలను విదేశాలకు పంపించేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకపోయినా, రుణం మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎంత రుణం మంజూరు అవుతుందన్న దానికి.. తల్లిదండ్రుల క్రెడిట్ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర), ఆదాయ స్థాయులు ఇతర అంశాలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. అదే సమయంలో రుణం తీసుకునే ముందు రుణ గ్రహీతలు కూడా కొన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.

విద్యా వ్యయం
విద్యా రుణానికి మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయమిదే. అప్పుడే రుణం ఎంత తీసుకోవాలన్నది తెలుస్తుంది. ట్యూషన్ ఫీజు, నివాస వ్యయం, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులను చూడాలి. ఫీజులు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే.. అంతే నాణ్యమైన విద్యను తక్కువ ఫీజులకు అందించే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి.

స్కాలర్ షిప్ లు
విద్యా వ్యయ భారాన్ని గణనీయంగా తగ్గించుకునే మార్గాల్లో స్కాలర్ షిప్ ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎన్నో స్కాలర్ షిప్ లను ఆఫర్ చేస్తుంటాయి. చాలా సంస్థలు దీనిపై ప్రకటనలు ఇవ్వడం కానీ, ప్రచారం చేయడం కానీ కనిపించదు. అందుకని కొంచెం ముందు నుంచే ఈ విషయమై వివరాలు రాబట్టుకునే కృషి చేయాలి.

రుణం ఎక్కడ?
ప్రముఖ విద్యా సంస్థల్లో అడ్మిషన్ లభించిన వారికి విద్యా రుణం మంజూరు చేసేందుకే ఎక్కువ బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కనుక అడ్మిషన్ కోసం ఎంపిక చేసుకుంటున్న కాలేజీ బ్యాంకుల జాబితాలో ఉందా? లేదా అని విచారించుకోవాలి. సొంతంగా ఆర్థిక వనరులు ఉంటే ఫర్వాలేదు. రుణం ద్వారానే విదేశీ విద్య చేయాలనుకుంటే.. గుర్తింపు ఉన్న కాలేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి.

రుణ నిబంధనలు
రుణానికి కావాల్సిన అర్హతలు ఉంటే అప్పుడు ఎంత రుణం లభిస్తుందో తెలుసుకోవాలి. ట్యూషన్ ఫీజులకే బ్యాంకులు రుణాలిస్తాయి. నివాసం, ఆహారం, ప్రయాణానికి అయ్యే వ్యయాలను సొంతంగా సమకూర్చుకోవాలి. ఇందుకు ముందే ప్రణాళిక వేసుకోవాలి. రుణంపై వడ్డీ రేటు, ఈఎంఐ వీటి పట్ల దృష్టి పెట్టాలి. విద్యార్థి తల్లిదండ్రులను బ్యాంకులు కోపేయర్ గా చేర్చుకుంటున్నాయి. ఏదో ఒక హామీ అడుగుతున్నాయి. కనుక వీటి గురించి అడిగి తెలుసుకోవాలి. విద్యా రుణానికి చేసే చెల్లింపులకు ఆదాయపన్ను చట్టం కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి.

చెల్లింపులు
రుణం మంజూరు తర్వాత.. విరామ సమయం ఉంటుంది. దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరిన నాటి నుంచి చెల్లింపులు చేసేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. లేదంటే విద్యార్థి తల్లి లేదా తండ్రి అయినా వారి ఆదాయం నుంచి చెల్లించుకోవచ్చు. ముందుగా క్లోజ్ చేస్తే పడే చార్జీల గురించి తెలుసుకోవాలి.

  • Loading...

More Telugu News