DGP: బలవంతంగా తనను తెలంగాణ ప్రభుత్వం సెలవుపై పంపిందని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందన
- రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు
- నేను ఇంట్లో కాలుజారి పడ్డాను
- నా ఎడమ భుజానికి గాయమైంది
- ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నాను
- వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరతాను
తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ ఐఏఎస్‌ల ముఠా ఏలుతోందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డిని సైతం పక్కనబెట్టి బీహార్‌కు చెందిన అంజనీకుమార్‌ను ఇన్‌చార్జ్ డీజీపీగా నియమించారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో దీనిపై మహేందర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఖండించారు.
తనను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని చేసిన ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. తాను ఇంట్లో కాలుజారి పడటంతోనే తనకు ఎడమ భుజానికి గాయమైందని వివరించారు. తన భుజంపైన మూడు చోట్ల ఫ్యా ఫ్రాక్చర్ అయినట్లు తెలిపారు. ఈ విషయం ఎక్స్ రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టులలో తేలిందని, భుజం కదలకుండా కట్టుకట్టారని అన్నారు.
అందుకే తాను ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వ తేదీ వరకు సెలవులో ఉన్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు విధుల్లో చేరతానని వివరించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని అన్నారు. సీనియర్ అధికారిపై ఆరోపణలను చేయడం సరికాదని చెప్పారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఇతర అధికారులపై ఆరోపణలు, వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. మరోవైపు, ఐఏఎస్‌లను నిందించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారిని నిందిస్తే వారి విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు ఐఏఎస్‌లపై చేస్తోన్న ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్‌లను ఏ రాష్ట్రానికైనా కేటాయిస్తారని తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాంతీయతను అంటగట్టడం వారి మనోభావాలను దెబ్బ తీయడం అప్రజాస్వామికమని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ కూడా తెలిపింది.