Ukraine: ప్రతిష్టంభన తొలగింది!.. ఉక్రెయిన్, రష్యాల మధ్య రెండో విడత చర్చలు!
- బుధవారమే జరగాల్సిన రెండో విడత చర్చలు
- తొలుత అంగీకరించి ఆపై బృందాన్ని పంపని ఉక్రెయిన్
- తాజాగా రష్యాతో చర్చలకు బెలారస్కు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం
- ఇప్పటికే బెలారస్ చేరిన రష్యా బృందం
యుద్ధంతో తలపడుతున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య రెండో విడత చర్చలపై నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. మరికాసేపట్లో రెండు దేశాల ప్రతినిధి బృందాలు బెలారస్లో రెండో విడత చర్చలను మొదలుపెట్టనున్నాయి. చర్చల వేదికకు రష్యా ప్రతినిధి బృందం ఇప్పటికే చేరుకోగా..ఉక్రెయిన్ ప్రతినిధి బృందం కూడా తమ దేశం నుంచి బెలారస్కు కాసేపటి క్రితం బయలుదేరింది. ఈ క్రమంలో బెలారస్ వేదికగా ఇరు దేశాల మధ్య రెండో విడత చర్చలు మొదలుకానున్నాయి.
వాస్తవానికి ఇరు దేశాల మధ్య రెండో విడత చర్చలు బుధవారమే మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు రెండు దేశాలు అంగీకరించాయి కూడా. చర్చలకు రష్యా ప్రతినిధి బృందం రెడీ అయ్యింది కూడా. అయితే ఓ వైపు తమ నగరాలపై అంతకంతకూ దాడుల తీవ్రతను పెంచుతున్న రష్యా.. మరోవైపు చర్చల పేరిట నాటకాలాడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈ క్రమంలో రష్యా ప్రతినిధి బృందం రెడీ అయిపోయినా..జెలెన్ స్కీ తమ దేశ ప్రతినిధి బృందాన్ని పంపలేదు. దీంతో బుధవారం రెండో విడత చర్చలు జరగనే లేదు. తాజాగా రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించడంతో మరికాసేపట్లో ఇరు దేశాల మధ్య రెండో విడత చర్చలు మొదలు కానున్నాయి.