Macron: పుతిన్ తో 90 నిమిషాల పాటు మాట్లాడిన ఫ్రాన్స్ అధ్యక్షుడు... ఉక్రెయిన్ మరింత దారుణ పరిస్థితులు ఎదుర్కోబోతోందని వెల్లడి
- ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తున్న రష్యా
- ఖండిస్తున్న అంతర్జాతీయ సమాజం
- పుతిన్ కు మేక్రాన్ ఫోన్
- పౌరులపై దాడి చేయవద్దని విజ్ఞప్తి
ఉక్రెయిన్ నగరాలను చేజిక్కించుకునేందుకు రష్యన్ సేనలు దాడుల్లో తీవ్రత పెంచిన నేపథ్యంలో, వ్లాదిమిర్ పుతిన్ తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇరువురు నేతలు దాదాపు 90 నిమిషాలు పాటు సంభాషించారు. ఈ టెలిఫోన్ సమావేశం అనంతరం, మేక్రాన్ సన్నిహితుడొకరు స్పందించారు. ఇప్పటివరకు జరిగింది ఒకెత్తయితే, ఇకపై జరగబోయేది మరొక ఎత్తు అని మేక్రాన్ అభిప్రాయపడినట్టు తెలిపారు. ఉక్రెయిన్ దారుణ పరిస్థితులు ఎదుర్కోనుందని ఆయన భావిస్తున్నారని వివరించారు.
పుతిన్ మాటలను బట్టి చూస్తే, ఈ ఆపరేషన్ ను కొనసాగించేందుకే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోందని, పుతిన్ మాటల సారాంశం అంతకుమించి మరేమీ లేదని మేక్రాన్ సన్నిహితుడు వివరించారు. ఉక్రెయిన్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడమే పుతిన్ లక్ష్యమని, పుతిన్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే... ఉక్రెయిన్ ను నాజీయిజం నుంచి విముక్తి కల్పించడానికి సదరు ఆపరేషన్ చేపడుతున్నారని పేర్కొన్నారు.
అయితే, ఫ్రాన్స్ దేశాధినేత మేక్రాన్ ఈ వైఖరిని ఖండించారని, అంతేకాకుండా, పౌరులపై దాడులు చేయవద్దని కోరారని, మానవతాదృక్పథంతో చేసే సాయాన్ని ఉక్రెయిన్ పౌరులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారని ఆ సన్నిహితుడు వెల్లడించారు. పుతిన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించినా, కచ్చితమైన హామీలేవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
అదే సమయంలో, ఉక్రెయిన్ లో సాధారణ పౌరులను రష్యన్ బలగాలు లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నాయన్న ఆరోపణలను పుతిన్ ఖండించారని వెల్లడించారు.