Balineni Srinivasa Reddy: వివేకా హత్యతో అవినాశ్ కు సంబంధం లేదు.. విచారణ తప్పుదోవ పడుతోంది: బాలినేని
- వివేకా హత్య కేసు దర్యాప్తును న్యాయంగా చేయాలి
- అవినాశ్ ను విచారించాల్సిన అవసరం లేదు
- రాబోయే ఎన్నికల్లో వైసీపీ 160 స్థానాల్లో గెలుస్తుంది
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఎంతో మంది వాంగ్మూలాలను సీబీఐ అధికారులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును న్యాయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ హత్యతో అవినాశ్ కు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అవినాశ్ ను విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు తప్పుదోవ పడుతోందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని అన్నారని... జీవితంలో చంద్రబాబు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టడని ఆరోజే తాము అనుకున్నామని బాలినేని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ 160 స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అమరావతికి సంబంధించి నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేని పనులను... మూడు నెలల్లో తమ ప్రభుత్వం ఎలా చేయగలదని ప్రశ్నించారు.