Cricket: వందో టెస్టులో కోహ్లీ ఔట్.. అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసిన ఎంబుల్దెనియా.. పలు రికార్డులు కోహ్లీ వశం
- 45 పరుగుల వద్ద పెవిలియన్ కు కోహ్లీ
- చప్పట్లతో అభినందనలు తెలిపిన అభిమానులు
- 8 వేల పరుగుల మైలు రాయిని చేరిన కింగ్ కోహ్లీ
- 169 ఇన్నింగ్స్ లలో ఘనత అందుకున్న మాజీ సారథి
- వందో టెస్టులో ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు
వందో టెస్టులో విరాట్ కోహ్లీ అవుటైపోయాడు. 44వ ఓవర్ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 80కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. హనుమ విహారితో కలిసి చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 76 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లున్నాయి. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో.. లసిత్ ఎంబుల్దెనియా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 90 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడినట్టయింది.
కోహ్లీ వందో టెస్టుపై ఇవాళ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రపంచంలోని అతి కొద్ది మంది జాబితాలో కోహ్లీ నిలుస్తుండడం, భారత ప్లేయర్లలో 12వ వాడే కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సెంచరీ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొడితే చూడాలని తపించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. మంచి ప్లాట్ ఫాం వేసుకున్న కోహ్లీ.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు.
ఎంబుల్దెనియా వేసిన అద్భుతమైన ఫ్లైటెడ్ బంతిని బ్యాక్ ఫుట్ లో డిఫెండ్ చేయడానికి కోహ్లీ ప్రయత్నించగా.. బంతి స్పిన్ అయి ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. గుడ్ లెంగ్త్ లో పడిన బంతిని డిఫెండ్ చేయడంలో కోహ్లీ ఫెయిలయ్యాడు. బౌల్డ్ కావడంతో కోహ్లీ నమ్మలేకపోయాడు. కాసేపు నిరాశగా అక్కడే నిలబడి కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో అభిమానులూ షాక్ అయ్యారు. నిలబడి కోహ్లీకి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేశారు.
కాగా, ఈ మ్యాచ్ లోనే కోహ్లీ మరో ఫీట్ ను సాధించాడు. 8 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. 169 ఇన్నింగ్స్ లలో కోహ్లీ ఈ మార్కును చేరుకున్నాడు. భారత్ తరఫున 154 ఇన్నింగ్స్ లలోనే 8 వేల పరుగుల మైలు రాయిని సచిన్ చేరుకున్నాడు. కోహ్లీ కన్నా ముందు రాహుల్ ద్రావిడ్ 157 ఇన్నింగ్స్ లు, సెహ్వాగ్ 160 ఇన్నింగ్స్ లు, గవాస్కర్ 166 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ ను సాధించారు. మరో వైపు వందో టెస్టులో 8 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2006లో దక్షిణాఫ్రికాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆ ఫీట్ ను సాధించాడు.
కాగా, కోహ్లీ ఔటైన కాసేపటికే హనుమ విహారి కూడా ఔటయ్యాడు. ఫెర్నాండో బౌలింగ్ లో వికెట్ల మీదకు బంతిని ఆడాడు. అతడు 128 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (10), శ్రేయస్ అయ్యర్ (5) క్రీజులో ఉన్నారు.