Chandrababu: చేతకానివాళ్లే కులం, మతం, ప్రాంతం గురించి మాట్లాడతారు: చంద్రబాబు
- ఐ-టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
- సమర్థులు అభివృద్ధి గురించి ఆలోచిస్తారని వెల్లడి
- తెలుగువాళ్లే తన కుటుంబ సభ్యులని వివరణ
- జగన్ తప్పుడు ప్రచారాలతో గెలిచాడని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఐ-టీడీపీ విభాగం సభ్యులతో నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతం గురించి మాట్లాడేది చేతకానివాళ్లేనని విమర్శించారు. సమర్థులు అభివృద్ధి గురించి ఆలోచిస్తారని అన్నారు. తెలుగు ప్రజలే నా కులం, మతం... తెలుగువారే నా కుటుంబ సభ్యులు అని పేర్కొన్నారు.
సెల్ ఫోన్లే ఐ-టీడీపీ కార్యకర్తలకు ఆయుధాలు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిజాల వెలికితీతలో ఐ-టీడీపీ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల సమయంలో అవాస్తవాలు, తప్పుడు ప్రచారాల ద్వారానే జగన్ గెలిచాడని ఆరోపించారు. మనం వాస్తవాలు ప్రచారం చేసి ముందుకెళ్లాలని అన్నారు. వాస్తవాలు చెప్పి వైసీపీని అడ్రస్ లేకుండా చేయాలని స్పష్టం చేశారు.
బాబాయ్ ని చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అంటూ మండిపడ్డారు. గుండెపోటుతో మొదలై గొడ్డలిపోటు దాకా మారిందని, సిగ్గులేకుండా సీబీఐపైనా ఎదురుదాడికి దిగారని విమర్శించారు. ఏ సినిమాలోనూ చూడని విధంగా బాబాయిని హత్య చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రూ.40 కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర? అంటూ ప్రశ్నించారు.
ఇక, అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనూ చంద్రబాబు స్పందించారు. అమరావతి తీర్పును బ్లూ మీడియాలో చూపించలేదని ఆరోపించారు. వాళ్లు చూపించనంత మాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఆగాయా? అని పేర్కొన్నారు. సోషల్ మీడియా శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలని అన్నారు.