CBI: వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రపై జగన్ నోరు విప్పాలి: నారా లోకేశ్
- సీబీఐ దర్యాప్తులో అవినాశ్ పాత్ర స్పష్టం
- జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
- ప్లాన్ మొత్తం జగన్ కనుసన్నల్లోనే జరిగిందా?
- జగన్ ను కూడా సీబీఐ విచారించాలన్న లోకేశ్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ ఫ్యామిలీకే చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర అంతకంతకూ స్పష్టమవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గడచిన ఎన్నికల్లో తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గడచిన రెండు రోజులుగా పర్యటిస్తున్న లోకేశ్.. రెండో రోజైన శుక్రవారం మంగళగిరి మునిసిపాలిటీలో పర్యటించారు. పట్టణంలోని పలు వార్డులు తిరిగిన లోకేశ్ జనంతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రస్తావించిన లోకేశ్.. సీబీఐ కొనసాగిస్తున్న దర్యాప్తులో వివేకా హత్యకు వైఎస్ అవినాశ్ రెడ్డి సూత్రధారి అన్నమాట స్పష్టమవుతోందని అన్నారు. ఈ క్రమంలో తన చిన్నాన్నను పొట్టనబెట్టుకున్న అవినాశ్ రెడ్డిపై చర్యలు తీసుకునే విషయంలో జగన్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. జగన్ తీరు చూస్తుంటే..వివేకా హత్యకు సంబంధించిన ప్లాన్ మొత్తం జగన్ కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ ను కూడా సీబీఐ విచారించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.