TV Rain: యుద్ధం వద్దంటూ లైవ్ లోనే ఉద్యోగాలకు రాజీనామా చేసిన రష్యన్ టీవీ చానల్ సిబ్బంది... వీడియో ఇదిగో!
- ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
- పుతిన్ నిర్ణయంపై రష్యాలోనూ నిరసనలు
- ఉక్రెయిన్ యుద్ధ వార్తలను కవర్ చేసిన 'టీవీ రెయిన్' చానల్
- చానల్ పై ఆంక్షలు విధించిన రష్యా ప్రభుత్వం
- నిరవధికంగా ప్రసారాలు ఆపేసిన చానల్ యాజమాన్యం
ఉక్రెయిన్ పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయానికి స్వదేశంలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, రష్యాకు చెందిన ఓ టీవీ చానల్ సిబ్బంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తమ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. 'టీవీ రెయిన్' చానల్ సిబ్బంది చివరగా యుద్ధం వద్దు అనే ప్రకటనతో చానల్ ప్రసారాలకు స్వస్తి పలికారు. వాళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది.
'టీవీ రెయిన్' చానల్ ఉక్రెయిన్ యుద్ధాన్ని కవర్ చేసేందుకు రష్యా ప్రభుత్వం అంగీకరించలేదు. అంతేకాదు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రపంచానికి చూపిస్తోందన్న కారణంతో ఆ చానల్ ప్రసారాలను నిలిపివేసింది. దాంతో చానల్ లో లైవ్ వస్తుండగానే, ఉద్యోగులందరూ రాజీనామా చేసి వెళ్లిపోయారు. టీవీ చానల్ యాజమాన్యం కూడా తమ సిబ్బందికి మద్దతు పలికింది.
టీవీ చానల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నటాలియా సిండియేవా మాట్లాడుతూ, యుద్ధం వద్దు అనే ప్రకటనను ప్రసారం చేసి తమ సిబ్బంది స్టూడియో నుంచి వాకౌట్ చేశారని వెల్లడించారు. ఆపై చానల్ వర్గాలు ఓ ప్రకటన చేశాయి. తమ చానల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నాయి.
కాగా, చానల్ సిబ్బంది లైవ్ లో రాజీనామా చేసి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 'టీవీ రెయిన్' చానల్ మాత్రమే కాదు, 'ఎకో మాస్కో' అనే రేడియో స్టేషన్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఉక్రెయిన్ యుద్ధ వార్తలను ప్రసారం చేయవద్దని రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో, ఈ రేడియో స్టేషన్ తన ప్రసారాలను నిలిపివేసింది.