Andhra Pradesh: బెజవాడ పోలీస్ కమిషనర్ దొడ్డ మనసు!.. రౌడీ షీటర్లకు జాబ్ మేళా!
- రౌడీ షీటర్లకు అడ్డాగా విజయవాడ
- వారికి కొత్త జీవితం కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసిన కమిషనర్
- జాబ్ మేళాకు రౌడీ షీటర్ల నుంచి ఊహించని స్పందన
ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడ నగరం రౌడీ షీటర్లకు అడ్డాగా అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గతంతో పోల్చి చూస్తే... నగరంలో రౌడీ షీటర్ల సంఖ్య ఇప్పుడు భారీగానే తగ్గిపోయిందనే చెప్పాలి. అదే సమయంలో రౌడీ మూకల ఆగడాలు కూడా తగ్గడంతో ప్రస్తుతం నగరం ఒకింత ప్రశాంతంగానే ఉందని చెప్పాలి.
ఇలాంటి సందర్భంలో గతంలో రకరకాలుగా రౌడీయిజం చేసిన రౌడీలు.. ఇప్పుడు ఇటు రౌడీయిజం చేసేందుకు అవకాశాలు లేక, అటు ఉపాధి లేక నానా పాట్లు పడుతున్నారు. వీరిని పోలీసులు నిత్యం గమనిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో పలువురు రౌడీ షీటర్లను విచారించిన సందర్భంగా వారి కష్టాలేమిటో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాకు తెలిసి వచ్చాయట. ఆ కష్టాలను కడతేర్చి రౌడీయిజాన్ని వదిలేసిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆలోచించారట.
అనుకున్నదే తడవుగా పలు పారిశ్రామిక సంస్థలతో చర్చలు జరిపిన కమిషనర్.. నగరంలో ఓ భారీ జాబ్ మేళాకు రంగం సిద్ధం చేశారు. దాదాపుగా 16 సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ జాబ్ మేళా శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ జాబ్ మేళాకు లెక్కలేనంత మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో యువత కూడా జాబ్ మేళాకు వచ్చారట. కమిషనర్ ఆశించినట్టుగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు దొరికితే..రౌడీ షీటర్లు నిజంగానే కొత్త జీవితం ప్రారంభించినట్టే కదా?