TDP: అసెంబ్లీకి చంద్ర‌బాబు ఒక్క‌రే రారు.. మిగ‌తా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజ‌రు

All except Chandrababu will attend the AP Assembly budget meetings

  • చంద్ర‌బాబు భార్యపై వైసీపీ స‌భ్యుల అనుచిత వ్యాఖ్య‌ల ఆరోపణలు 
  • నిర‌స‌న‌గా స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీడీపీ
  • బ‌డ్జెట్ స‌మావేశాలు కావ‌డంతో ప్ర‌తిప‌క్షం లేకుంటే ఎలా అనే చ‌ర్చ‌
  • ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోలేక‌పోయిన పొలిట్ బ్యూరో
  • చివ‌ర‌కు టీడీఎల్పీ భేటీలో పార్టీ కీల‌క నిర్ణ‌యం

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజర‌వ్వాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డిన విప‌క్ష టీడీపీ ఎట్ట‌కేల‌కు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత, అసెంబ్లీలో విప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు మిన‌హా మిగిలిన వారంతా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని పార్టీ కాసేప‌టి క్రితం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం చంద్ర‌బాబు ఒక్క‌రే అసెంబ్లీ స‌మావేశాల‌కు గైర్హాజ‌ర‌వుతారు. మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు య‌థావిధిగా స‌మావేశాల‌కు హాజ‌రు కానున్నారు.

ఇప్ప‌టికే పార్టీ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై సుదీర్ఘ చ‌ర్చే జ‌రిగింది. అయితే ఆ భేటీలో ఏకాభిప్రాయం వ్య‌క్తం కాలేదు. చంద్ర‌బాబు భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పేదాకా అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కారాద‌ని మెజారిటీ స‌భ్యులు తెలిపారు. దీంతో ఈ విష‌యంపై నిర్ణ‌యాన్ని టీడీఎల్పీకే వ‌దిలేస్తూ పొలిట్ బ్యూరో నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ నెల 7 నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా.. శ‌నివారం నాడు చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న టీడీఎల్పీ భేటీని వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించారు. భేటీలో చంద్ర‌బాబు భార్యపై వైసీపీ అనుచిత వ్యాఖ్య‌లు, అందుకు నిర‌స‌న‌గా స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన పార్టీ.. ప్ర‌స్తుతం బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షం లేక‌పోతే ప్ర‌జ‌ల‌కు జ‌రిగే న‌ష్టం.. త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. అన్ని అంశాల‌పై చ‌ర్చించిన టీడీఎల్పీ చివ‌ర‌కు.. చంద్ర‌బాబు మిన‌హా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని తీర్మానించింది.

  • Loading...

More Telugu News