Chinmayi: మా అమ్మ నా అధికార ప్రతినిధి కాదు... ఆమెకు ఫోన్ చేయొద్దు: గాయని చిన్మయి శ్రీపాద
- మీటూ ఉద్యమంతో కలకలం రేపిన చిన్మయి
- తన తల్లికి ఫోన్లు వస్తున్నాయని వెల్లడి
- తన మేనేజర్ ను సంప్రదించాలని సూచన
- తల్లి అభిప్రాయాలకు బాధ్యురాలిని కాదన్న చిన్మయి
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. వృత్తిపరమైన, లేదా వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఎవరైనా నేరుగా తననే సంప్రదించాలని స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో తన గురించి వివరాల కోసం తన తల్లి పద్మహాసిని అయ్యంగార్ కి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని చిన్మయి వివరించింది. తన తల్లి తనకేమీ అధికార ప్రతినిధి కాదని, ఇకపై ఆమెకు ఫోన్లు చేసి ఇబ్బందిపెట్టవద్దని విజ్ఞప్తి చేసింది.
ఆమె ఏదైనా వ్యక్తపరిస్తే అది ఆమె స్వంత అభిప్రాయం మాత్రమేనని చిన్మయి స్పష్టం చేసింది. తల్లి అభిప్రాయాలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యురాలిని కాదని పేర్కొంది. ఇకపై వృత్తిపరమైన విషయాల కోసం తనను సంప్రదించాలనుకుంటే తన మేనేజర్ విష్ణుతో మాట్లాడాలని చిన్మయి వెల్లడించింది. గాయని చిన్మయి శ్రీపాద కొంతకాలం కిందట మీటూ ఉద్యమంతో తీవ్ర కలకలం రేపారు. ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.