senior citizens: రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మరణ ముప్పును తగ్గించుకోవచ్చు?
- నిత్యం 10,000 అడుగుల నడక అక్కర్లేదు
- 6,000-8,000 అడుగులతో మంచి ఫలితాలు
- 50 శాతం తక్కువ మరణ ముప్పు
- మసాచుసెట్స్ యూనివర్సిటీ అధ్యయన ఫలితాలు చెబుతున్నదిదే
సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు, ఆపైన) రోజులో కనీసం 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న ఒక సూత్రం ఆచరణలో ఉంది. తాజా అధ్యయనం మాత్రం.. రోజుకు 6,000 అడుగుల నుంచి 8,000 అడుగుల నడక పెద్దలకు సరిపోతుందని, ఇంతకుమించి అవసరం లేదని గుర్తించింది. ఈ వివరాలు ద లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి.
రోజుకు కనీసం 7,000 అడుగులు నడవడం వల్ల ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి సాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకానీ, నిత్యం మరింత ఎక్కువగా నడవడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధనలో గుర్తించారు. అదే 60 ఏళ్లలోపు వయసున్న వారు రోజూ 8,000-10,000 అడుగుల మేర నడవడం ద్వారా ముందస్తు మరణాన్ని నివారించగలిగినట్టు తెలిపింది.
ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికాలో 47,451 మందిపై జరిగిన 15 అధ్యయనాలను మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా విశ్లేషించారు. రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మరణ ముప్పును తగ్గించుకోవచ్చన్నదే వీరి అధ్యయన ప్రధాన అంశం. ఎన్ని అడుగులు నడుస్తున్నామో తెలుసుకునేందుకు మొబైల్ యాప్స్, చేతికి, మెడలో ధరించే బ్యాండ్లు వచ్చిన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.
దీనిపై హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ఆశిష్ మాట్లాడుతూ.. రోజుకు 10,000 అడుగుల థియరీ అన్నది జపాన్ కు చెందిన పెడోమీటర్ల తయారీ కంపెనీ మార్కెటింగ్ ఎత్తుగడగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదన్నారు. రోజులో 7,000 అడుగులు నడవడం అన్నది మ్యాజిక్ సంఖ్యగా చెప్పారు.
మసాచుసెట్స్ యూనివర్సిటీ గత అధ్యయనాలను పరిశీలించినా.. రోజుకు 7,000 అడుగులు నడిచే వారికి.. అంతకంటే ఎక్కువ నడిచే వారితో పోలిస్తే 50-70 శాతం తక్కువ మరణ ముప్పు ఉంటున్నట్టు తెలిసింది. కనుక మరీ ఎక్కువ నడవాల్సిన అవసరం లేకుండా 6,000-7,000 అడుగులు నడిచేలా ప్లాన్ చేసుకుంటే సరి.